యోహాను 10:1-19
యోహాను 10:1-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగ దోచుకునేవాడని నేను మీతో చెప్పేది నిజము. గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి. కావలివాడు కాపరికి తలుపు తీస్తాడు. ఆ గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి, వాటిని బయటకు నడిపిస్తాడు. అతడు తన సొంత గొర్రెలను బయటకు తీసుకువచ్చినప్పుడు వాటికి ముందుగా నడుస్తాడు, ఆ గొర్రెలకు అతని స్వరం తెలుసు కాబట్టి అవి అతన్ని వెంబడిస్తాయి. అయితే క్రొత్తవారి స్వరాన్ని అవి గుర్తించవు కాబట్టి వారిని వెంబడించవు; నిజానికి, అవి వారి నుండి పారిపోతాయి” అని చెప్పారు. ఈ సాదృశ్యం ద్వారా యేసు చెప్పిన విషయాన్ని పరిసయ్యులు గ్రహించలేకపోయారు. కాబట్టి యేసు మళ్ళీ వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, గొర్రెలకు ద్వారం నేనే అని మీతో చెప్పేది నిజం. నాకన్నా ముందు వచ్చిన వారందరు దొంగలు దోచుకునేవారే. కాబట్టి గొర్రెలు వారి మాటలు వినలేదు. నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు. వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు. దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను. “నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు. జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది. జీతగాడు జీతం కొరకే పని చేస్తాడు కాబట్టి గొర్రెల గురించి పట్టించుకోకుండా పారిపోతాడు. “నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను. ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద ఒక్క కాపరి ఉంటాడు. నేను నా ప్రాణాన్ని మళ్ళీ పొందడానికే దాన్ని పెడుతున్నాను, కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు. నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు. ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి.
యోహాను 10:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి. నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.” ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
యోహాను 10:1-19 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు. తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి. ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి. అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు. యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు. అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు. నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది. “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు. “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.” ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి.
యోహాను 10:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను –గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.