యోహాను 1:40-45
యోహాను 1:40-45 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు. అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును కనుగొన్నాం” అని చెప్పి, అతన్ని యేసు దగ్గరకు తీసుకొనివచ్చాడు. యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అని పిలువబడతావు” అని చెప్పారు. మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు. ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందినవాడు. ఫిలిప్పు, నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు.
యోహాను 1:40-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం). మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.
యోహాను 1:40-45 పవిత్ర బైబిల్ (TERV)
యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు. తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం. మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.
యోహాను 1:40-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.