యోహాను 1:29-51
యోహాను 1:29-51 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల! ‘నా తర్వాత వచ్చేవాడు నన్ను మించినవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్న వాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే. ఆయన ఎవరో నాకే తెలియదు, కాని ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయడానికి నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను” అన్నాడు. అప్పుడు యోహాను ఇలా సాక్ష్యం ఇచ్చాడు: “పరలోకం నుండి ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం నేను చూసాను. అయితే నాకే ఆయన తెలియలేదు కానీ, ‘నీవు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలిచియుండడం చూస్తావో, ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు’ అని నీళ్ళతో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పారు. నేను చూసాను గనుక ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.” మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు. అతడు యేసు వెళ్తున్నప్పుడు చూసి “ఇదిగో దేవుని గొర్రెపిల్ల!” అని చెప్పాడు. అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి, తనని వెంబడిస్తున్న వారిని చూసి, “మీకు ఏమి కావాలి?” అని అడిగారు. అందుకు వారు “రబ్బీ, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?” అని అడిగారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. ఆయన, “వచ్చి చూడండి” అని చెప్పారు. కనుక వారు వెళ్లి ఆయన ఉన్నచోటును చూసి, ఆ రోజంతా ఆయనతో గడిపారు. అప్పటికి సాయంకాలం సుమారు నాలుగు గంటలైంది. యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు. అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును కనుగొన్నాం” అని చెప్పి, అతన్ని యేసు దగ్గరకు తీసుకొనివచ్చాడు. యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అని పిలువబడతావు” అని చెప్పారు. మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు. ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందినవాడు. ఫిలిప్పు, నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు. “నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు. అందుకు ఫిలిప్పు “వచ్చి చూడు” అన్నాడు. నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు. అందుకు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అని అడిగాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు ఆ అంజూరపుచెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసాను” అని చెప్పారు. అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు. అందుకు యేసు “నీవు ఆ అంజూరపుచెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసానని చెప్పినందుకు నీవు నమ్మావు. దీని కంటే గొప్ప కార్యాలను నీవు చూస్తావు” అని అతనితో చెప్పారు. తర్వాత యేసు, “ఆకాశం తెరువబడి, దేవదూతలు మనుష్యకుమారుని మీద ఎక్కడం, దిగడం మీరు చూస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
యోహాను 1:29-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల! ‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.” యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.” మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు. అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు. ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు. యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం). మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు. దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”
యోహాను 1:29-51 పవిత్ర బైబిల్ (TERV)
మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు. ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.” మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు. ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.) యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది. యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు. తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం. మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు. నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు. నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు. “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు. యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు. నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు. యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.
యోహాను 1:29-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు– ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు–నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి–ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి–మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు–రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి యను మాటకు బోధకుడని అర్థము. – వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు–బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు –ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన – మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.