యోహాను 1:14-17
యోహాను 1:14-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు–నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
యోహాను 1:14-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము. యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నన్ను మించినవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్న వాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు. ఆయన సంపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుకొన్నాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.
యోహాను 1:14-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము. యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.” ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.
యోహాను 1:14-17 పవిత్ర బైబిల్ (TERV)
ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’” ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు.