యిర్మీయా 32:30-35
యిర్మీయా 32:30-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు అయిన ఈ ప్రజలు, కచ్చితంగా తమ చిన్నతనం నుంచి నా ఎదుట చెడుతనమే చేస్తూ వచ్చారు. తమ చేతులతో వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు కచ్చితంగా నాకు కోపమే పుట్టించారు.” ఇది యెహోవా వాక్కు. “ఎందుకంటే, ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు. వాళ్ళ రాజులు, వాళ్ళ ప్రధానులు, వాళ్ళ యాజకులు, వాళ్ళ ప్రవక్తలు, యూదాలోనూ, యెరూషలేములోనూ ఉన్న ప్రజలందరూ నన్ను రెచ్చగొట్టే చెడు ప్రవర్తన అంతటిని బట్టి, ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను. నేను ఉదయాన్నే లేచి వాళ్లకు బోధించినా వాళ్ళు నా ఉపదేశం అంగీకరించ లేదు. వాళ్ళు నా వైపు తమ ముఖం తిప్పడానికి బదులుగా తమ వీపును తిప్పారు. తరువాత వాళ్ళు నా పేరు పెట్టిన మందిరాన్ని అపవిత్రం చెయ్యడానికి దానిలో హేయమైన వాటిని పెట్టారు. వాళ్ళు తమ కొడుకులను, కూతుళ్ళను మొలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న బయలు దేవుడికి గుళ్ళు కట్టారు. ఇలా చెయ్యడానికి నేను వాళ్లకు ఆజ్ఞ ఇవ్వలేదు. యూదా వాళ్ళు పాపంలో పడి, ఇంత అసహ్యమైన పనులు చేస్తారని నా హృదయంలో ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
యిర్మీయా 32:30-35 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు. “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు. వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు. “బెన్‌హిన్నోము లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
యిర్మీయా 32:30-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలనవారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు. నాకోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపకపోయిరి, వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పు కొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్‍హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
యిర్మీయా 32:30-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమ చిన్ననాటి నుండి నా దృష్టికి చెడు తప్ప మరి ఏమీ చేయలేదు. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలు తమ చేతులు చేసిన వాటితో నాకు కోపం తెప్పించడం తప్ప మరేమీ చేయలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఈ పట్టణం కట్టబడిన రోజు నుండి ఇప్పటివరకు నాకు కోపాన్ని, ఉగ్రతను రప్పిస్తూనే ఉన్నది. ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు. వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు. నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు. వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.