యిర్మీయా 30:18-24

యిర్మీయా 30:18-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది. అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను. వాళ్ళ ప్రజలు మునుపటిలా ఉంటారు. వాళ్ళను హింసించే వాళ్ళందరినీ నేను శిక్షించినప్పుడు, వాళ్ళ సమాజం నా ఎదుట స్థిరం అవుతుంది. వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?” ఇది యెహోవా వాక్కు. “అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను. చూడు, యెహోవా ఉగ్రత పెనుగాలిలా బయలుదేరింది. అది ఎల్లప్పుడూ వీచే పెనుగాలి. అది సుడిగాలిలా దుష్టుల తలల మీద గిరగిరా తిరుగుతుంది. తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”

షేర్ చేయి
Read యిర్మీయా 30

యిర్మీయా 30:18-24 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు. కాని వారు తిరిగివస్తారు. యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను. నగరమంతా కూలిపోయిన భవనాలతో కప్పబడిన కొండలా ఉంది. కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది. ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు. ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు. వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను. ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు. యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను. అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను. వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం వహిస్తాడు. ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు. నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు. అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను. అతడు నాకు సన్నిహితుడవుతాడు. మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను.” యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు! ఆయన ప్రజలను శిక్షించినాడు. ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది. ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది. తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు. ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో) మీరు అర్థం చేసుకుంటారు.

షేర్ చేయి
Read యిర్మీయా 30

యిర్మీయా 30:18-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు– యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను. వారి కుమారులుమునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారిమధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును. తన కార్యము ముగించువరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.

షేర్ చేయి
Read యిర్మీయా 30

యిర్మీయా 30:18-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది. వాటినుండి కృతజ్ఞతాగీతాలు ఆనంద ధ్వనులు వస్తాయి. నేను వారి సంఖ్యను తగ్గించకుండ, అధికం చేస్తాను; నేను వారికి ఘనతను తెస్తాను, వారు అసహ్యానికి గురికారు. వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను. వారి నాయకుడు వారిలో ఒకడు; వారి పాలకుడు వారి మధ్య నుండి లేస్తాడు. నేను అతన్ని దగ్గరికి తీసుకువస్తాను, అతడు నా దగ్గరికి వస్తాడు నన్ను సమీపించే సాహసం చేయగల వ్యక్తి ఎవరు?’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ” చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా వీస్తూ దుష్టుల తలలపైకి తిరుగుతుంది. ఆయన తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు యెహోవా తీవ్రమైన కోపం చల్లారదు. రాబోయే రోజుల్లో మీరు దీన్ని గ్రహిస్తారు.

షేర్ చేయి
Read యిర్మీయా 30