యిర్మీయా 24:1-10

యిర్మీయా 24:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యూదారాజు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, అధికారులను, నైపుణ్యం కలిగిన పనివారిని, యూదా కళాకారులను బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు. యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు. అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను. వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను. నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు. “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా, హేళనకు కారణంగా చేస్తాను. నేను వారికి, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నేను వారి మీదికి ఖడ్గాన్ని కరువును తెగులును పంపుతాను.’ ”

యిర్మీయా 24:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు. ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి. “యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను “అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.” అన్నాను. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను. వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను. నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.” “యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు. వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను. నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.”

యిర్మీయా 24:1-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి. “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు. “నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను. పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను. నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను. వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను. “కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు. నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు. వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”

యిర్మీయా 24:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బబులోను రాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి. యెహోవా–యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా నేను–అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–వారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్ల గింపక వారిని నాటెదను. వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.