యిర్మీయా 20:7-13
యిర్మీయా 20:7-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు. చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు. అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది. సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు. యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.
యిర్మీయా 20:7-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను. నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి, హేళనచేస్తున్నారు. “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను. అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం! లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు! అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు. లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు. కాని యెహోవా నాతో వున్నాడు. యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు. కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు. వారు నన్ను ఓడించలేరు. వారి ప్రయత్నం వ్యర్థం. వారు ఆశా భంగం చెందుతారు. వారు అవమానం పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు. సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు. మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు. ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము. యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము! యెహోవా పేద వారిని ఆదుకుంటాడు! ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
యిర్మీయా 20:7-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు–దుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు. అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికిచేయు ప్రతి దండన నేను చూతును గాక యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.
యిర్మీయా 20:7-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి. “దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను. చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.” అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు. సైన్యాల యెహోవా! మీరు నీతిమంతులను పరీక్షిస్తారు, అంతరింద్రియాలను, హృదయాలను పరిశీలిస్తారు. నా వాదన మీకే అప్పగిస్తున్నాను, మీరు వారికి ఎలా ప్రతీకారం చేస్తారో నేను చూస్తాను. యెహోవాను కీర్తించండి! యెహోవాను స్తుతించండి! దుష్టుని బారి నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తారు.