యిర్మీయా 17:9-11
యిర్మీయా 17:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
యిర్మీయా 17:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు? నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను. కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.”
యిర్మీయా 17:9-11 పవిత్ర బైబిల్ (TERV)
“మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి. మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది. మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు. కాని యెహోవానైన నేను ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను. ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను. ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది. డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా అలాంటి పక్షిలాంటి వాడే. వాని జీవితం సగంగడిచే సరికి వాని ధనం పోతుంది. తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”
యిర్మీయా 17:9-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
హృదయం అన్నిటికంటే మోసకరమైనది నయం చేయలేని వ్యాధి కలది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? “యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.” అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు. వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది, చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు.