యిర్మీయా 17:5-7
యిర్మీయా 17:5-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు. అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.
యిర్మీయా 17:5-7 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు: “ఇతర ప్రజలను నమ్మేవారికి కీడు జరుగుతుంది. బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి కష్ట నష్టాలు వస్తాయి. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు. ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు. ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. ఆ పొద ఎండిన ఉష్ణ ప్రదేశంలో ఉంది. ఆ పొద చవుడు భూమిలో ఉంది. ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు. కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
యిర్మీయా 17:5-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. –నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
యిర్మీయా 17:5-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా ఇలా అంటున్నారు: “మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు, కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు, యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు. వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు. “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.