యిర్మీయా 16:1-13
యిర్మీయా 16:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, “నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.” ఈ స్థలంలో పుట్టే కొడుకుల గురించి కూతుళ్ళ గురించి, వాళ్ళను కనిన తల్లులను గురించి, ఈ దేశంలో వాళ్ళను కనిన తండ్రులను గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.” యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను ఈ ప్రజలకు నా శాంతి, నా దయ, నా వాత్సల్యం తీసివేశాను, కాబట్టి విలపించే వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వాళ్ళను గురించి విలపించడానికి వెళ్ళవద్దు. ఎవరినీ ఓదార్చడానికి వెళ్ళవద్దు.” ఇది యెహోవా వాక్కు. ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు. చచ్చినవారి గురించి ప్రజలను ఓదార్చడానికి వారితో కలిసి తినే వాళ్ళెవరూ ఉండరు. ఒకరి నాన్న గానీ అమ్మ గానీ చనిపోతే కూడా ఎవరూ వారిని ఓదార్చేలా తాగడానికి ఏమీ ఇవ్వరు. విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు. ఇశ్రాయేలు దేవుడు, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీ కళ్ళ ముందే మీ రోజుల్లోనే ఇక్కడే సంతోష ధ్వనినీ ఉత్సవ ధ్వనినీ పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు స్వరాలనూ ఆపబోతున్నాను.” నువ్వు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచేసిన తరువాత, వారు “యెహోవా మాకెందుకు ఈ ఘోర విపత్తు నిర్ణయించాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన దోషం, పాపం ఏమిటి?” అని నిన్ను అడుగుతారు. అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు. కాబట్టి నేను మీ పట్ల ఏమాత్రం దయ చూపను. ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి ఇక్కడ నుంచి మిమ్మల్ని విసిరివేస్తాను. అక్కడ మీరు రాత్రింబగళ్ళు ఇతర దేవుళ్ళను పూజిస్తారు.”
యిర్మీయా 16:1-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా వర్తమానం నాకు వచ్చింది: “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.” యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు: “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.” అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబుచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు. చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు. “విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’ “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’ అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది: ‘వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు. కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు. కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’
యిర్మీయా 16:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులనుగూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులనుగూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు. ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు. చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రియైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు. వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను. నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారు–దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము– యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మీపితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటనుబట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీపితరులకంటె విస్తారముగా చెడుతనము చేసియున్నారు. కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీపితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.
యిర్మీయా 16:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.” ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.” యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు. చనిపోయినవారి కోసం దుఃఖించేవారిని ఓదార్చడానికి ఎవరూ ఆహారం ఇవ్వరు కనీసం తండ్రి తల్లి చనిపోయినా సరే వారిని ఓదార్చేలా త్రాగడానికి ఏమీ ఇవ్వరు. “విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి తినడానికి, త్రాగడానికి కూర్చోవద్దు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను. “నీవు ఈ సంగతులను ఈ ప్రజలకు చెప్పినప్పుడు, ‘యెహోవా మనపై ఇంత పెద్ద విపత్తును ఎందుకు విధించారు? మేము చేసిన తప్పేంటి? మన దేవుడైన యెహోవాకు విరోధంగా మనం ఏమి పాపం చేశాం?’ అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు. అయితే మీరు మీ పూర్వికులకంటే దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరందరూ నాకు విధేయత చూపకుండ మీ దుష్ట హృదయాల మొండితనాన్ని ఎలా అనుసరిస్తున్నారో చూసుకోండి. కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశం నుండి మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని దేశంలోకి విసిరివేస్తాను, అక్కడ మీరు పగలు రాత్రి ఇతర దేవుళ్ళను సేవిస్తారు, ఎందుకంటే నేను మీకు ఎలాంటి దయ చూపను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.