యిర్మీయా 1:1-10

యిర్మీయా 1:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బెన్యామీను గోత్ర ప్రాంతంలోని అనాతోతులో నివసించే యాజకుల్లో ఒకడు, హిల్కీయా కొడుకు అయిన యిర్మీయా పలుకులు. ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు. యోషీయా కొడుకు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్న రోజుల్లో, యోషీయా కొడుకు సిద్కియా యూదాను పాలించిన 11 వ సంవత్సరం అయిదో నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్ళే వరకూ ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, “నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.” అందుకు నేను “అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు” అన్నాను. అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి. వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.” అప్పుడు యెహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు. “ఇదిగో, నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను. పెళ్లగించడానికీ విరగగొట్టడానికీ నశింపజేయడానికీ కూలదోయడానికీ కట్టడానికీ నాటడానికీ నేను ఈ రోజు జనాల మీదా రాజ్యాల మీదా నిన్ను నియమించాను.”

షేర్ చేయి
Read యిర్మీయా 1

యిర్మీయా 1:1-10 పవిత్ర బైబిల్ (TERV)

ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది. యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనిపోబడ్డారు. యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది. “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.” అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను. కాని యెహోవా ఇలా అన్నాడు: “బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి. ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”. ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది. పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను. దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటిని కట్టి నాటుతావు.”

షేర్ చేయి
Read యిర్మీయా 1

యిర్మీయా 1:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు –ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను. మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు–అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను– నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను–ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.

షేర్ చేయి
Read యిర్మీయా 1

యిర్మీయా 1:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు. ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి, యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. యెహోవా వాక్కు నాకు వచ్చి, “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది. అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను. అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి. నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.” తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను. పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు.

షేర్ చేయి
Read యిర్మీయా 1