న్యాయాధిపతులు 7:7-25
న్యాయాధిపతులు 7:7-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా “చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు” అని గిద్యోనుతో చెప్పాడు. ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు “నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను. వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు. ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి. గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు. అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు. గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి, ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి. చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి. నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు. కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు. అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు. వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు, నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు. గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి “మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి” అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు. వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.
న్యాయాధిపతులు 7:7-25 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు. కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు. గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను. రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు. ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు. మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది. గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెబుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు. ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు. ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’” కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది మనుష్యులు వారి శత్రువుల విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు. అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు. గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు. అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు. ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు. కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలిచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు. మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.
న్యాయాధిపతులు 7:7-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యెహోవా–గతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమతమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెనుగాని ఆ మూడువందలమందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను–నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను. పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా–నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు–అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి–లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆకుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను–నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు–యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్నకుండలను పగులగొట్టిరి. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆకుండలను పగులగొట్టి, యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని–యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్దనున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి–మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరు కూడుకొని బేత్బారావరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరే బును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.
న్యాయాధిపతులు 7:7-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా గిద్యోనుతో, “గతికిన మూడువందల మనుష్యులతో నేను మిమ్మల్ని రక్షించి, మిద్యానీయులను మీ చేతులకు అప్పగిస్తాను. మిగిలినవారం తిరిగి వెళ్లిపోవాలి” అని ఆజ్ఞాపించారు. కాబట్టి గిద్యోను మిగితా ఇశ్రాయేలీయులను ఇంటికి పంపించాడు, అయితే మూడువందలమంది మనుష్యులు ఆహారాన్ని, బూరలను పట్టుకున్నారు. మిద్యాను దండు అతనికి క్రింద లోయలో దిగారు. ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, “నీవు లేచి మిద్యాను దండుపై దాడి చేయి, నేను నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను. ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు, వారు ఏం చెప్పుకుంటున్నారో విను. తర్వాత దండుపై దాడి చేయడానికి నీకు ధైర్యం వస్తుంది” అన్నారు. కాబట్టి అతడు, అతని పనివాడైన పూరా ఆ పాళెంలో ఉన్న స్థావరాల దగ్గరకు వెళ్లారు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పు జనాంగాలు లెక్కకు మిడతలవలె లోయలో విడిది చేశారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుక రేణువుల్లా లెక్కించలేనంత ఉన్నాయి. గిద్యోను వచ్చినప్పుడు ఒక వ్యక్తి తాను కనిన కలను తన స్నేహితునికి చెబుతూ, “నాకు ఒక కల వచ్చింది. గుండ్రని యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటు వెళ్లి బలంగా గుడారానికి తగలగానే గుడారం తలక్రిందులై కూలిపోయింది” అని అన్నాడు. అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు. గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు. ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు. గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి. నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.” నడి జాము వేళ మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు. ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు. దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది. మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు. నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు. గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు. వారు మిద్యాను నాయకుల్లో ఓరేబు, జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు, జెయేబు ద్రాక్షతోట దగ్గర జెయేబును చంపారు. వారు మిద్యానీయులను వెంటాడి, యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరకు ఓరేబు, జెయేబు తలలను తెచ్చారు.