న్యాయాధిపతులు 6:12-24

న్యాయాధిపతులు 6:12-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు. అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు. అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు, నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు. అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు. అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు. అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.

న్యాయాధిపతులు 6:12-24 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.” యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు. అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు. యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.” యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు. కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు. దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు. యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు. గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు. కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు. కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.

న్యాయాధిపతులు 6:12-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు –చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. అందుకతడు–నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన–నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లనుకుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి– నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడాలాగుచేయగా యెహోవాదూత తన చేతనున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవాదూత అతనికి అదృశ్య మాయెను. గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని–అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను. అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠముకట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.

న్యాయాధిపతులు 6:12-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు. అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?” గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.” యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు. అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి. నేను తిరగి వచ్చి, నా అర్పణ తెచ్చి, మీ ముందు పెట్టే వరకు మీరు వెళ్లకండి.” అందుకు యెహోవా అన్నారు, “నీవు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటాను.” గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు. దేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులియని రొట్టెలను తీసుకుని ఈ రాతి మీద పెట్టి, ఆ రసం దాని మీద పోయి” అన్నాడు. గిద్యోను అలాగే చేశాడు. అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు. అయితే యెహోవా అతనితో, “నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు” అన్నారు. కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.