న్యాయాధిపతులు 3:12-21
న్యాయాధిపతులు 3:12-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయులు మరలా యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, వారు చెడు కార్యాలు చేసినందుకు యెహోవా మోయాబు రాజైన ఎగ్లోనుకు ఇశ్రాయేలుపై బలం ఇచ్చారు. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను పోగుచేసుకుని ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూర చెట్ల పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు. ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులుగా ఉన్నారు. మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్ను చెల్లించడానికి పంపారు. ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల ఖడ్గాన్ని చేసికొని దానిని కుడి తొడకు కట్టుకుని తన బట్టలు క్రింద కప్పుకున్నాడు. అతడు ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు చెల్లించాడు; ఎగ్లోను చాలా లావుపాటి మనిషి. ఏహూదు కప్పము చెల్లించిన తర్వాత దానిని మోసిన మనుష్యులను పంపించేశాడు. గిల్గాలు దగ్గరున్న రాతి ప్రతిమల దగ్గరకు వచ్చిన తర్వాత అతడు తిరిగి ఎగ్లోను దగ్గరకు వెళ్లి, “రాజా, మీకు ఒక రహస్య సందేశం చెప్పాలి” అని అన్నాడు. రాజు తన సేవకులతో, “మమ్మల్ని విడిచి వెళ్లండి!” అని చెప్పాడు, వారందరు వెళ్లిపోయారు. అతడు తన రాజభవనంలో మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు, ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.
న్యాయాధిపతులు 3:12-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని వెళ్లి ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూరచెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజుకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద దాన్ని కట్టుకుని, ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండే వాడు. ఏహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి “రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి” అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళే వరకూ మాట్లాడవద్దని చెప్పాడు. ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు. అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు.
న్యాయాధిపతులు 3:12-21 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు. ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు. ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు. ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు. అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు.
న్యాయాధిపతులు 3:12-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి– రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడు–తనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవువరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు–నీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను. అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.