న్యాయాధిపతులు 13:1-25
న్యాయాధిపతులు 13:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు ప్రజలు మరోసారి యెహోవా దృష్టిలో దోషులయ్యారు. కాబట్టి ఆయన వారిని ఒక నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు “చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.” అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు. ఆయన నాతో, ‘చూడు నువ్వు గర్భవతివి అవుతావు. కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గానీ, మద్యాన్ని గానీ తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకూ దేవుని కోసం నాజీర్ గా ఉంటాడు’ అని చెప్పాడు” అంది. అప్పుడు మనోహ “నా ప్రభూ, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పించడానికి నువ్వు పంపిన ఆ దేవుని మనిషి మరోసారి మా దగ్గరికి వచ్చేట్లుగా చెయ్యి” అని యెహోవాకు ప్రార్థన చేసాడు. దేవుడు మనోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కన్పించాడు. అప్పుడు ఆమె భర్త మనోహ ఆమె దగ్గర లేడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి “ఆ రోజు నాకు కన్పించిన వ్యక్తి మళ్ళీ కన్పించాడు” అని చెప్పింది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా” అని అడిగాడు. అందుకా వ్యక్తి “నేనే” అన్నాడు. అప్పుడు మానోహ “నీ మాట ప్రకారమే జరుగుతుంది గాక. ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియ చేయండి” అన్నాడు. అందుకు జవాబుగా యెహోవా దూత “నేను ఆ స్త్రీకి చెప్పినదంతా ఆమె జాగ్రత్తగా చేయాలి. ఆమె ద్రాక్ష నుండి వచ్చేది ఏదీ తినకూడదు, ఆమె ద్రాక్షారసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకూడదు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రంగా చెప్పిన దేనినీ తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి” అని మనోహకు చెప్పాడు. అప్పుడు మనోహ “మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకూ ఆగమని మనవి చేస్తున్నాను” అని యెహోవా దూతతో అన్నాడు. దానికి యెహోవా దూత మనోహ “నేను ఆగినా నీ భోజనాన్ని మాత్రం ఆరగించను. ఒక వేళ నువ్వు దహన బలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి” అన్నాడు. ఆయన యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ “నువ్వు చెప్పిన ప్రకారం జరిగిన తరువాత నిన్ను సన్మానించాలి గదా, మరి నీ పేరు ఏమిటి?” అని అడిగాడు. దానికి యెహోవా దూత “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అన్నాడు. అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతోబాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్యా అది చూసి నేలపై పడి నమస్కారం చేసారు. ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు. మనోహ తన భార్యతో “మనం దేవుణ్ణి చూశాం కాబట్టి కచ్చితంగా చనిపోతాం” అన్నాడు. కానీ అతని భార్య “యెహోవా మనలను చంపాలనుకుంటే మనం అర్పించిన దహనబలినీ ధాన్యపు నైవేద్యాన్నీ అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విషయాలను మనకు చూపించి ఉండేవాడూ కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సంగతులను మనకు చెప్పేవాడూ కాదు,” అంది. తరువాత ఆ స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.
న్యాయాధిపతులు 13:1-25 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం మళ్లీ యెహోవా చూశాడు. అందువల్ల ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరాల పాటు పరిపాలించేందుకు యెహోవా అనుమతించాడు. జొర్యాకి చెందిన ఒకతను ఉండేవాడు. అతని పేరు మానోహ. అతను దాను వంశానికి చెందినవాడు. మానోహకు ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరినీ కనలేక పోయింది. యెహోవాదూత మానోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఇలా అన్నాడు: “నీవు పిల్లల్ని కనలేకపోయావు. కాని నీవు గర్భవతివవుతావు. ఒక కొడుకుని కంటావు. ఏ మద్యంగాని, ఘాటైన పానీయంగాని నీవు తాగవద్దు. అపరిశుభ్రమైన ఆహారం కూడా నీవు తినవద్దు. ఎందుకంటే నీవు గర్భవతివై, ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. అతను నాజీరవుతాడు. అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తిరించకు. అతను జన్మించడానికి పూర్వమె అతను దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా వుంటాడు. అతను ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల అధికారం నుంచి కాపాడతాడు.” తర్వాత ఆమె తన భర్త వద్దకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: “దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయపెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు. కాని నాతో ఇలా అన్నాడు: ‘నీవు గర్భవతివి. నీకొక కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర ఘాటైన పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే ఆహారమూ తినవద్దు. ఎందుకంటే, ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. ఆ బాలుడు దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి మరణించేంత వరకు అతను విలక్షణమైన మనిషి.’” ఆ తర్వాత మానోహ యెహోవాను ప్రార్థించాడు. అతను ఇలా అన్నాడు: “యెహోవా, దేవ దూతను మళ్లీ మా వద్దకు పంపవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాలుడుగా జన్మించనున్న అతనికి మేము ఏమి చేయాలో అది ఆ దేవదూత మాకు నేర్పాలి” దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవదూత మళ్లీ ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె వద్ద లేడు. అందువల్ల అది చెప్పాలని భర్త వద్దకు పరుగెత్తి, “ఆ మనిషి తిరిగి వచ్చాడు! మొన్న వచ్చిన అతను ఇక్కడే వున్నాడు.” అని తన భర్తతో చెప్పింది. మానోహ లేచి తన భార్యను అనుసరించాడు. అతను ఆ మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు. “నేనే” అన్నాడు దేవదూత. అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు. యెహోవాదూత మానోహతో ఇలా చెప్పాడు: “నేను చెప్పినదంతా నీ భార్య చేయాలి. ద్రాక్షాతీగ మీద పెరిగే దానిని ఆమె తినకూడదు. ఆమె మద్యము తాగకూడదు. అపరిశుభ్రమైన ఆహారం తినకూడదు. ఏమి చేయుమని ఆమెను ఆజ్ఞాపించానో, ఆమె అదంతా చేయాలి.” అప్పుడు ఆ యెహోవాదూతతో మానోహ ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక లేత మేకను వండిపెట్టాలని అనుకుంటున్నాము.” యెహోవాదూత మానోహతో ఇలా అన్నాడు: “నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే ఆహారం తినను. కాని మీరేదైనా చెయ్యదలుచుకుంటే, అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” (ఆ వ్యక్తి నిజంగా యెహోవాదూత అని మానోహ అర్థం చేసుకోలేక పోయాడు). అప్పుడు యెహోవాదూతను, “నీ పేరేమిటి? నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను.” యెహోవాదూత ఇలా చెప్పాడు: “నా పేరు మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరము” అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక లేత మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహోవాకు, మరియు అద్భుతాలు చేసే వ్యక్తికీ సమర్పించాడు. మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొగలు లేచినప్పుడు, యెహోవాదూత ఆ మంటలలో పరమునకు వెళ్లిపోయాడు! ఎప్పుడైతే అది మానోహ, అతని భార్య చూసారో, నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు. ఆ వ్యక్తి నిజంగానే యెహోవాదూత అని చివరికి మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు ప్రత్యక్షం కాలేదు. మానోహ తన భార్యతో ఇలా అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. అందువల్ల తప్పకుండా మనం మరణిస్తాము!” కాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని దేవుడు భావించడం లేదు. యెహోవా కనుక మనల్ని చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తువుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది. తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. యెహోవా ఆత్మ సమ్సోనులో పనిచేయనారంభించింది. అతనప్పుడు మహెనుదాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం జోర్యా, ఎష్తాయోలుకు మధ్య ఉంది.
న్యాయాధిపతులు 13:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను. ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను. యెహోవాదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై–ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి –దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతో చెప్పలేదు గాని–ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడినవాడైయుండునని నాతో చెప్పెననెను. అందుకు మానోహ–నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడు కొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి–ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చి–ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకు మానోహ–కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా యెహోవాదూత–నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను. అప్పుడు మానోహ–మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవాదూతతో చెప్పగా యెహోవాదూత–నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించినయెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవాదూత అని మానోహకు తెలియలేదు. మానోహ–నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవాదూతను అడుగగా యెహోవాదూత–నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను. అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవాదూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవాదూత మానోహకును అతని భార్యకును మరెన్నడు ప్రత్య క్షము కాలేదు. ఆయన యెహోవాదూత అని మానోహ తెలిసికొని–మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య–యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
న్యాయాధిపతులు 13:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు. కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండ జాగ్రతపడాలి, అపవిత్రమైనది ఏది తినకూడదు. నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.” అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు. అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ” అప్పుడు మనోహ యెహోవాకు, “ప్రభువా, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలున్ని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనున్ని మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను” అని ప్రార్ధించాడు. దేవుడు మనోహ ప్రార్ధన విన్నారు. ఆ స్త్రీ పొలంలో ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు; కాని అప్పుడు తన భర్త మనోహ ఆమెతో లేడు. ఆ స్త్రీ తన భర్త దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “ఆ రోజు నాకూ ప్రత్యక్షమైన వ్యక్తి మళ్ళీ కనిపించాడు” అని చెప్పింది. మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ మనిషి, ఆ మనిషి దగ్గరకు వచ్చి, “నా భార్యతో మాట్లాడినది నీవేనా?” అని చెప్పాడు. “నేనే” అని అతడు అన్నాడు. కాబట్టి మనోహ, “నీవు చెప్పింది జరిగాక ఆ బాలుడు ఎలా జీవించాలి, ఏమి చేయాలి?” అని అతన్ని అడిగాడు. యెహోవా దూత, “నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి. ఆమె ద్రాక్షావల్లి నుండి వచ్చేది ఏదీ తినకూడదు, ద్రాక్షరసం మద్యం పుచ్చుకోకూడదు, అసలు అపవిత్రమైనదేది తినకూడదు. నేను ఆజ్ఞాపించిన ప్రతిదీ ఆమె చేయాలి” అన్నాడు. మనోహ యెహోవా దూతతో, “మేము నీకోసం మేకపిల్లను సిద్ధపరచే వరకు దయచేసి ఇక్కడ ఉండండి” అన్నాడు. అందుకు యెహోవా దూత, “మీరు ఆపినా సరే, నేను మీ ఆహారంలో ఏది తినను. అయితే మీరు దహనబలి సిద్ధపరిస్తే, అది యెహోవాకు అర్పించాలి” అన్నాడు (అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించలేదు.) అప్పుడు మనోహ యెహోవా దూతను, “నీవు చెప్పింది జరిగాక మేము నిన్ను గౌరవించాలి కాబట్టి నీ పేరేంటి?” యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు. మనోహ భోజనార్పణతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి రాతి మీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మనోహ, అతని భార్య చూస్తూ ఉండగా యెహోవా దూత అద్భుతం చేశాడు. ఆ బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తూవుంటే, ఆ మంటలతో పాటు యెహోవా దూత పైకి వెళ్లిపోయాడు. ఇది చూసి మనోహ, అతని భార్య నేల మీద సాష్టాంగపడ్డారు. ఆ తర్వాత యెహోవా దూత మనోహకు, అతని భార్యకు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించాడు. “మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు. అయితే అతని భార్య, “యెహోవా మనలను చంపాలని అనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు, వీటన్నిటిని మనకు చూపించేవారు కారు, ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు” అని చెప్పింది. ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు. అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.