యాకోబు 5:1-12
యాకోబు 5:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కోసం ధనాన్ని కూడబెట్టారు. చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి. మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతులను మీరు శిక్షించి వారిని హత్య చేశారు. కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమి నుండి విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు! సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు. చివరకు ప్రభువు అతనికి చేసిన దాన్ని చూసి ప్రభువు ఎంతో జాలి దయ గలవారని మీరు తెలుసుకున్నారు. అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు.
యాకోబు 5:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు. చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి. మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు. కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి. సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు. నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.
యాకోబు 5:1-12 పవిత్ర బైబిల్ (TERV)
ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు. మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి. మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు. అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు. సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి. నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
యాకోబు 5:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపెట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.