యాకోబు 2:1-13
యాకోబు 2:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నా సహోదరీ సహోదరులారా, పక్షపాతం కలిగిన మీ పనులతో మహిమ గల మన ప్రభువైన యేసుక్రీస్తులో మీరు నిజంగా విశ్వాసం కలిగివున్నారా? బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకొన్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చారు. విలువైన బట్టలు వేసుకొన్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” లేదా “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, మీరు మీ మధ్యలోనే భేదం చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కారా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వాళ్లు కాదా? మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? “నిన్ను ప్రేమించుకున్నట్టే, నీ పొరుగువాని కూడా ప్రేమించు” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. అయితే మీరు పక్షపాతం చూపిస్తే, మీరు పాపం చేసి, ఆజ్ఞాతిక్రమం వల్ల ధర్మశాస్త్రం బట్టి అపరాధులు అవుతారు. ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి అన్ని ఆజ్ఞలకు వారు బాధ్యతవహించాల్సి ఉంటుంది. “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు నరహత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచారం చేయకపోయినా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి ప్రవర్తించాలి. ఎందుకంటే దయచూపించనివారి పట్ల దయచూపించకుండా తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.
యాకోబు 2:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి. ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి. కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.
యాకోబు 2:1-13 పవిత్ర బైబిల్ (TERV)
నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా! నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా? “నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు” అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు. ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు” అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా! స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.
యాకోబు 2:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్నవారు వీరే గదా? మీకు పెట్టబడిన శ్రేప్ఠమైన నామమును దూషించువారు వీరే గదా? మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి. స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.
యాకోబు 2:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి. బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కాదా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వారు కాదా? మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? “మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే. అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు. “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి. ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.