యాకోబు 1:3-12
యాకోబు 1:2-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
యాకోబు 1:3-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిపక్వం చెంది సంపూర్ణులుగా అవడానికి, ఏ విషయంలో కూడా మీకు కొరత లేకుండా ఉండడానికి పట్టుదలను తన పనిని పూర్తి చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవుణ్ణి అడగండి అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది. ఆయన తప్పులను ఎంచకుండా అందరికీ ఉదారంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలిచేత విసరబడి కొట్టివేయబడే సముద్రపు అలల్లాంటివారు; కనుక వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. దీనులైన విశ్వాసులు తాము పైకెత్తబడుతున్న విధానాన్ని బట్టి అతిశయించాలి, అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే గడ్డిలోని ఒక పువ్వులా ధనవంతులు కనుమరుగవుతారు. కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.
యాకోబు 1:3-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.
యాకోబు 1:2-12 పవిత్ర బైబిల్ (TERV)
నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు. పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట.
యాకోబు 1:3-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.