యెషయా 7:1-4
యెషయా 7:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను అప్పుడు–సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను–ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము –భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.
యెషయా 7:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు. అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి. అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు.
యెషయా 7:1-4 పవిత్ర బైబిల్ (TERV)
ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు. దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు. అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది. “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు.
యెషయా 7:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు. అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి. అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు.