యెషయా 61:3-7
యెషయా 61:3-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును. చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు మీరు యెహోవాకు యాజకులనబడుదురు –వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురువారి ప్రభావమును పొంది అతిశయింతురు మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించివారు సంతోషింతురువారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.
యెషయా 61:3-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు. నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు. పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు. తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు. విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు. మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు. రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు. మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు దీవెనలు వస్తాయి. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. నిత్యానందం వారిది అవుతుంది.
యెషయా 61:3-7 పవిత్ర బైబిల్ (TERV)
దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు. పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు క్రొత్తవాటిలా చేయబడతాయి. అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ గొర్రెలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల పిల్లలు మీ పొలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు. మీరు “యెహోవా యాజకులు” అని, “మన దేవుని సేవకులు” అని పిలువబడతారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు. గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల కంటెకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. కనుక ఇతర ప్రజలకంటె రెండంతలు ఎక్కువగా మీరు మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే సంతోషం మీకు లభిస్తుంది.
యెషయా 61:3-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు. పురాతన శిథిలాలను వారు మరలా కడతారు గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; పాడైపోయిన పట్టణాలను తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు. అపరిచితులు మీ మందల్ని మేపుతారు; విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు. మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు. మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.