యెషయా 54:8-10
యెషయా 54:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు. “ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను. పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.
యెషయా 54:8-10 పవిత్ర బైబిల్ (TERV)
నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను. కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.” నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు. దేవుడు చెబుతున్నాడు: “నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది. ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను. అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.” యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు, కొండలు ధూళి కావచ్చును. కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు. నేను నీతో సమాధానపడతాను, అది ఎన్నటికీ అంతం కాదు.” యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.
యెషయా 54:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా 54:8-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు. “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను. పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.