యెషయా 54:7-17

యెషయా 54:7-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను. కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు. “ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను. పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు. బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను. కెంపులతో నీ కోట బురుజులను, మెరిసే రాళ్ళతో నీ గుమ్మాలను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను. యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది. నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు. ఎవరైనా చిక్కు తెస్తే, అది నా వలన కాదు. చిక్కు తెచ్చే వారెవరైనా ఓడిపోతారు. ఇదిగో విను! నిప్పులు ఊదే కమ్మరిని నేనే చేశాను. అతడు అక్కడ ఆయుధాలను చేస్తాడు. నాశనం చేయడానికి నాశనం చేసేవాణ్ణి చేసింది నేనే. నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.

షేర్ చేయి
Read యెషయా 54

యెషయా 54:7-17 పవిత్ర బైబిల్ (TERV)

దేవుడు చెబుతున్నాడు, “నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే. నేను నిన్ను మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు గొప్ప దయ చూపిస్తాను. నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను. కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.” నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు. దేవుడు చెబుతున్నాడు: “నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది. ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను. అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.” యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు, కొండలు ధూళి కావచ్చును. కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు. నేను నీతో సమాధానపడతాను, అది ఎన్నటికీ అంతం కాదు.” యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే. “అయ్యో, దీన పట్టణమా! తుఫానులు నిన్ను బాధించాయి, మరియు నీవు ఓదార్చబడలేదు. నేను నిన్ను మరల నిర్మిస్తాను. ప్రశస్తమైన రాళ్లను ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను. నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను. మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను. సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను. ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ కడతాను. నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు, ఆయన వారికి ఉపదేశం చేస్తాడు. నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది. న్యాయం ప్రయోగించి నేను నిర్మిస్తాను. కనుక నీవు అన్యాయానికి, కృ-రత్వానికి దూరంగా ఉండాలి. అప్పుడు నీవు భయపడాల్సింది. ఏమీ ఉండదు. ఏదీ నిన్ను బాధించుటకు రాదు. నా సైన్యాలు ఏవీ నీకు వ్యతిరేకంగా పోరాడవు. మరియు ఏ సైన్యమైనా నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తే నీవు ఆ సైన్యాన్ని ఓడిస్తావు. “చూడు, కమ్మరిని నేను చేశాను. అగ్నిని రాజ బెట్టేందుకు అతడు నిప్పుమీద విసరుతాడు. అప్పుడు అతడు వేడి ఇనుమును తీసుకొని, తాను చేయదలచుకొన్న పనిముట్టును చేస్తాడు. అదేవిధంగా నాశనం చేసే ‘నాశన కర్తను’ నేను సృజించాను. “నీ మీద పోరాడుటకు మనుష్యులు ఆయుధాలు చేస్తారు. కానీ ఆ ఆయుధాలు నిన్ను ఓడించవు. కొంత మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తిది తప్పు అని చూపించబడుతుంది.” “యెహోవా సేవకులకు ఏమి లభిస్తుంది? నా దగ్గర లభించే మంచి వాటన్నింటినీ వారు పొందుతారు” అని యెహోవా చెబుతున్నాడు.

షేర్ చేయి
Read యెషయా 54

యెషయా 54:7-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు. జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పని ముట్టుచేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించు వాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

షేర్ చేయి
Read యెషయా 54

యెషయా 54:7-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను. తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు. “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను. పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు. “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను. రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను. యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది. నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు. ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు. “చూడు, నిప్పులు ఊది మండించి తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే కమ్మరిని సృజించింది నేనే. నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే. నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

షేర్ చేయి
Read యెషయా 54