యెషయా 48:1-11
యెషయా 48:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు. మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను. నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు. అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు. నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను. అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు. “అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు. నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు. పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు. నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను. నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను. నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
యెషయా 48:1-11 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా చెబుతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను! మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు. మీరు యూదా వంశస్థులు. ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు. కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.” ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆయన పేరు. “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం క్రిందట నేను మీకు చెప్పాను. వాటిని గూర్చి నేను మీకు చెప్పాను. అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను. మీరు మొండివాళ్లని నాకు తెలుసు గనుక నేను అలా చేశాను. నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మటానికి నిరాకరించారు. వంగని ఇనుములా మీరు చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా ఉంది. కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను మీతో చెప్పాను. ఆ సంగతులు జరుగకముందే చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను. ‘మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము’ అని మీరు చెప్పకుండా నేనిలా చేశాను. ‘మా ప్రతిమలు-విగ్రహాలే వీటిని జరిగించాయి’ అని మీరు చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.” “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి. మీకు ఇంకా తెలియని క్రొత్త సంగతులను ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఇవి చాలాకాలం క్రిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు. ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు. అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు. కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట వినేందుకు నిరాకరిస్తారు. మీరు నేర్చు కొనేది శూన్యం. నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ మీరు వినలేదు. మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారని మొదట్నుండి నాకు తెలుసు. మీరు పుట్టినప్పట్నుండి తప్పుడు పనులే చేశారు. “కానీ నేను ఓపిగ్గా ఉంటాను. నా కోసమే నేను ఇలా చేస్తాను. నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు. సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు. “చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను. వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును ప్రయోగిస్తారు. కానీ నేను మీకు కష్టాలు కలిగించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చేస్తాను. నా కోసం, నా కోసమే నేను ఇలా చేస్తాను. ప్రాముఖ్యం లేనివానిగా మీరు నన్ను చేయలేరు. నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
యెషయా 48:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు . కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి. వారు–మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి –నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోతవిగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమా చారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో చించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ లేదు. అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నాకోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.
యెషయా 48:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి. మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, ఆయన పేరు సైన్యాల యెహోవా: గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి. ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు; నీ మెడ నరాలు ఇనుపవని, నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు. కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను; ‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను. నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను. అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు; ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు. అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’ అని నీవు చెప్పలేవు. నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు; పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు. నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు; నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు. నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను. చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను. నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను. నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను? నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.