యెషయా 46:1-13
యెషయా 46:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు మోస్తాయి. ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, అలసిపోయిన పశువులకు భారము. అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి. “యాకోబు వారసులారా, నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను. మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. “మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు? నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు? కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి వెండిని తీసుకువచ్చి బరువు తూచి, తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు. వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు. “దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి, తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి, చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు; నేను దేవుడును, నాలా ఎవరూ లేరు. నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను. పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను. ‘నా ఉద్దేశం నిలబడుతుంది నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను; దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను. నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను; నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను. మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి. నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.
యెషయా 46:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బేలు కూలిపోతూ ఉన్నాడు. నెబో కృంగుతూ ఉన్నాడు. వారి విగ్రహాలను జంతువులు, పశువులు మోస్తూ వెళ్తున్నాయి. వాటిని మోయడం పశువులకు భారంగా ఉంది, అవి సొమ్మసిల్లి పోతున్నాయి. అవి క్రుంగుతూ, తూలుతూ ఆ విగ్రహాలను కాపాడ లేక పోగా తాము కూడా చెరగా పట్టుబడ్డాయి. యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానంలో మిగిలిన వారలారా, మీరు గర్భంలో ప్రవేశించింది మొదలుకుని నేను మిమ్మల్ని భరించాను. మీరు తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. నా మాట వినండి. నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే. నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే. నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు? ప్రజలు విస్తారమైన బంగారం తెచ్చి పోస్తారు. వెండిని తెచ్చి బరువు తూస్తారు. ఒక కంసాలిని జీతానికి పిలిచి అతనికి దాన్ని అప్పగిస్తారు. అతడు దాన్ని ఒక దేవుడుగా రూపొందిస్తాడు. వారు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారు. వారు దాన్ని తమ భుజాల మీద ఎక్కించుకుంటారు. దాన్ని మోసుకుపోయి దాని స్థానంలో నిలబెడతారు. అది అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. ఒకడు దానికి మొర్రపెట్టినా జవాబు చెప్పదు, ఎవరి బాధా తీసివేయలేదు, రక్షించలేదు. ఈ విషయాలు ఆలోచించండి. వాటిని మర్చిపోవద్దు. తిరుగుబాటు చేసే మీరు దీన్ని ఆలోచించండి. చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు. ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను. “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను. నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించినదాన్ని సఫలం చేస్తాను. బండబారిన హృదయాలతో నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి. నా నీతిని మీకు దగ్గరగా తెచ్చాను. అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యం కాదు. సీయోనుకు నా రక్షణ అందిస్తాను. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహిస్తాను.
యెషయా 46:1-13 పవిత్ర బైబిల్ (TERV)
బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు. తప్పుడు దేవుళ్లు వట్టి విగ్రహాలే. మనుష్యులే ఆ విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన బరువులు మాత్రమే ఆ విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు. ఆ తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి. “యాకోబు వంశమా, నా మాట విను. ఇంకా బ్రతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాటవినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను. మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. కనుక మీ తల వెండ్రుకలు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. “మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా? లేదు. ఎవ్వరూ నాకు సమానులు కారు. నన్ను గూర్చి మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు. కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకొంటారు. అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు దేవుడికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు. ఆ మనుష్యులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. ఆ తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం, ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు ఆ విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, ఆ తప్పుడు దేవుడు కదల్లేడు. ఆ తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద కేకలు వేయవచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. ఆ తప్పుడు దేవుడు వట్టి విగ్రహం మాత్రమే. అది ప్రజలను వారి కష్టాల్లోంచి రక్షించజాలదు. “ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి. చాలాకాలం క్రిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. ఆ తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు. “అంతంలో జరిగే సంగతులను గూర్చి మొదట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగతులను గూర్చి చాలాకాలం క్రిందట నేను మీకు చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరుతుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను. తూర్పునుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనిషి గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబుతున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను. “మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా మాట వినండి! నేను మంచి పనులు చేస్తాను. త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని వస్తాను.”
యెషయా 46:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను. కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను.