యెషయా 40:10-31

యెషయా 40:10-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయనచేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమునుగూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు? జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానేయుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింపలేదా? ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయనలేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును. వారు నాటబడగనే విత్తబడగనేవారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయనయొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:10-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు. ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది. ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. తన దోసిలిలో జలాలను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాలను కొలిచిన వాడెవడు? భూమిలోని మన్ను అంతటినీ కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను, తూనికతో కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు? ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా? ఆయనకు తెలివిని ఇచ్చిన వాడెవడు? న్యాయమార్గాలను ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానాభ్యాసం చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధిమార్గం బోధించిన వాడెవడు? రాజ్యాలు చేద నుండి జారిపడే నీటి బిందువుల్లాంటివి. ప్రజలు త్రాసు మీది దుమ్మువంటివారు. ద్వీపాలు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లా ఉన్నాయి. అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి. ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు. కాబట్టి మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఏ విగ్రహ రూపాన్ని ఆయనకు సమానం చేస్తారు? విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు. కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు. విలువైన దాన్ని అర్పించలేని పేదవాడు పుచ్చిపోని చెక్కను తీసుకొస్తాడు. స్థిరంగా నిలిచే విగ్రహాన్ని చేయడానికి నేర్పుగల పనివాణ్ణి పిలుస్తాడు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా? ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు. రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు. చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు. సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు. “ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు. యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం. అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే. యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు. అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:10-31 పవిత్ర బైబిల్ (TERV)

చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు. మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు. వారి జీతం యెహోవా దగ్గర ఉంది. గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు. యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.” మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు? ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు? భూమిమీద ధూళి అంతటినీ కొలిచేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు? పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే. యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు. యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు. యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా? న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా? యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా? యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా? లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు. చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి. దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి. యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు. లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు. లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు. నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా? లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు. కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు. బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు. పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు. కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు. తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు. అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు. తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ? తప్పక అది నీవు విన్నావు. ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు. భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు. నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు. ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు. ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు. ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని క్రింద కూర్చునేందుకు పరిచాడు. నిజమైన దేవుడు పరిపాలకులను ప్రాముఖ్యత లేనివారినిగా చేస్తాడు. ఆయన ఈ లోకపు న్యాయమూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు. ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు. దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి. గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది. పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా? లేదు. నాకు ఎవరు సమానం కాదు.” పైన ఆకాశాలను చూడు. ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు. యాకోబూ, ఇది నిజం! ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి! “నేను జీవించే విధము యెహోవా చూడలేదు దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?” యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు. భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు. బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు. యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు. కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు. వారు అలసి పోకుండా నడుస్తారు.

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:10-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు, తన బలమైన చేతితో పరిపాలిస్తారు. చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది. గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు. తన చేతితో నీటిని కొలిచిన వారెవరు? జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు? భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనికతో కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు? యెహోవాకు సలహాదారునిగా ఆలోచన చెప్పగలవారెవరు? ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు? న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు? ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు? ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు? నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి. వారు కొలబద్దల మీది ధూళివంటి వారు; ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు. బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు. అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే; ఆయన దృష్టికి అవి విలువలేనివిగా శూన్యం కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? ఏ రూపంతో ఆయనను పోలుస్తారు? విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు. అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు; విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా? ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు. ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు. తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు. ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు. వారు నాటబడిన వెంటనే, వారు విత్తబడిన వెంటనే, వారి భూమిలో వేరు పారకముందే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు. “నన్ను ఎవరితో పోలుస్తారు? నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు. మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి: వీటన్నటిని సృజించింది ఎవరు? నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ, వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా. తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు. యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది; నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు. ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు. యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు. కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.

షేర్ చేయి
Read యెషయా 40