యెషయా 40:1-11

యెషయా 40:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీ దేవుడు చెబుతున్నది ఏమంటే, “ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి.” యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం ముగిసింది. ఆమెకు పాపాల వలన కలిగిన దోషం తీరిపోయింది. ఆమెకు చెప్పండి, యెహోవా చేతిలో ఆమె తన సమస్త పాపాల నిమిత్తం రెండింతల ఫలితం పొందిందని. వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, “అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.” ప్రతి లోయను ఎత్తు చేయాలి. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేయాలి. వంకర వాటిని తిన్నగా, గరుకైన వాటిని నునుపుగా చేయాలి. యెహోవా మహిమ వెల్లడి అవుతుంది. ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు. ఎందుకంటే యెహోవా దేవుడే ఇలా సెలవిచ్చాడు. వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. “నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది. యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.” సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ, భయపడకుండా స్థిరంగా ప్రకటించు. “ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు. ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు. ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది. ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:1-11 పవిత్ర బైబిల్ (TERV)

మీ దేవుడు చెబుతున్నాడు, “ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి! యెరూషలేముతో దయగా మాట్లాడండి. ‘నీ సేవాసమయం అయిపోయింది నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.” వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు. “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి. ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి. ప్రతి లోయనూ పూడ్చండి ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి. వంకర మార్గాలను చక్కగా చేయండి. కరకు నేలను సమనేలగా చేయండి. అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు. సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.” ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు. మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది. యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది. ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది. సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి. గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.” సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు. యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. భయపడవద్దు. గట్టిగా మాట్లాడు. యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు: “చూడు, ఇదిగో మీ దేవుడు! చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు. మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు. వారి జీతం యెహోవా దగ్గర ఉంది. గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు. యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, –నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి –ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయనచేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

షేర్ చేయి
Read యెషయా 40

యెషయా 40:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, అని మీ దేవుడు చెప్తున్నారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి ఆమె యుద్ధకాలం ముగిసిందని ఆమె పాపదోషం తీరిపోయిందని యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం రెండింతల ఫలం పొందిందని ఆమెకు తెలియజేయండి. బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం: “అరణ్యంలో యెహోవా కోసం మార్గాన్ని సిద్ధపరచండి ఎడారిలో మన దేవునికి రహదారిని సరాళం చేయండి. ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి పర్వతం ప్రతి కొండ సమం చేయబడుతుంది; వంకర త్రోవ తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి. యెహోవా మహిమ వెల్లడవుతుంది. దాన్ని ప్రజలందరు చూస్తారు. యెహోవాయే ఇది తెలియజేశారు.” “మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది. గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.” సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు. చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు, తన బలమైన చేతితో పరిపాలిస్తారు. చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది. గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.

షేర్ చేయి
Read యెషయా 40