యెషయా 33:14-16
యెషయా 33:14-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు? నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ, అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.
యెషయా 33:14-16 పవిత్ర బైబిల్ (TERV)
సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బ్రతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బ్రతకగలరు?” అని వారంటున్నారు. మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.
యెషయా 33:14-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును? నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.
యెషయా 33:14-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?” నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు, వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.