యెషయా 27:3-13
యెషయా 27:3-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను. నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను. ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి; వారు నాతో సమాధానపడాలి, అవును, వారు నాతో సమాధానపడాలి.” రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగురించి వికసించి లోకమంతటిని ఫలంతో నింపుతుంది. ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా? మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు. ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని మిగిలి ఉండవు. బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి. దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు. ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు. ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.
యెషయా 27:3-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా అనే నేనే దాన్ని సంరక్షిస్తున్నాను. ప్రతీ నిత్యం దానికి నీళ్ళు పోస్తున్నాను. దానికి ఎవడూ హాని తలపెట్టకుండా పగలూ రాత్రీ కాపలా కాస్తున్నాను. నాకిప్పుడు కోపం ఏమీ లేదు. ఒకవేళ గచ్చ పొదలూ ముళ్ళ చెట్లూ మొలిస్తే యుద్ధంలో చేసినట్టుగా వాటికి విరోధంగా ముందుకు సాగుతాను. వాటన్నిటినీ కలిపి తగలబెట్టేస్తాను. ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు నా సంరక్షణలోకి రావాలి. నాతో సంధి చేసుకోవాలి. వాళ్ళు నాతో సంధి చేసుకోవాలి. రాబోయే ఆ రోజున యాకోబు వేరు వ్యాపిస్తుంది. ఇశ్రాయేలు జాతి మొగ్గ వేసి పుష్పిస్తుంది. వాళ్ళు భూమినంతా ఫలభరితం చేస్తారు. యాకోబు, ఇశ్రాయేలును వాళ్ళు కొట్టారు. వాళ్ళను యెహోవా కొట్టాడు. వాళ్ళను కొట్టినట్టు యెహోవా యాకోబు, ఇశ్రాయేలును కొట్టాడా? యాకోబు, ఇశ్రాయేలును చంపిన వాళ్ళని ఆయన చంపినట్టు ఆయన యాకోబు, ఇశ్రాయేలులను చంపాడా? నువ్వు అలా చేయలేదు. స్వల్పమైన శిక్షనే విధించావు. ఇతర దేశాల్లోకి ఇశ్రాయేలును బహిష్కరించావు. తూర్పు నుండి తీవ్రమైన గాలి రప్పించి వాళ్ళని తరిమావు. యాకోబు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం జరుగుతుంది. అది అతడు చేసిన పాప పరిహారానికి కలిగే ఫలం. సున్నపురాతిని చూర్ణం చేసినట్టు అతడు బలిపీఠపు రాళ్ళను చిన్నాభిన్నం చేస్తాడు. అషేరా దేవతా స్తంభాలూ, ధూపం వేసే వేదికలూ ఇక నిలిచి ఉండవు. అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి. ఆ కొమ్మలు ఎండిపోయినప్పుడు విరిగిపడతాయి. స్త్రీలు వచ్చి వాటితో మంట పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రజలు జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ సృష్టికర్త వాళ్ళపై కనికరపడడు. వాళ్ళని చేసిన వాడు వాళ్ళపై దయ చూపించడు. ఆ రోజున యెహోవా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వాగు వరకూ వాళ్ళను ధాన్యాన్ని నూర్చినట్టు నూరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని ఒక్కొక్కరిగా సమకూరుస్తాడు. ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.
యెషయా 27:3-13 పవిత్ర బైబిల్ (TERV)
“యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను. సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను. రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను. ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు. నేను కోపంగా లేను. కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను. అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే, అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి. ప్రజలు నా దగ్గరకు వస్తారు. మంచి వేరులు గల మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు. వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు. అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.” యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా? యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి. యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి. ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి. ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు. ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు. మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు. నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు.
యెషయా 27:3-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప వలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును.వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా? నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు. ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగానుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును. దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు.వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు.వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.