యెషయా 2:6-22
యెషయా 2:6-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, యాకోబు వారసులైన మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు. వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు; వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు, ఇతరుల ఆచారాలను పాటిస్తారు. వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది; వారి ధనానికి అంతులేదు. వారి దేశం గుర్రాలతో నిండి ఉంది; వారి రథాలకు అంతులేదు. వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది. వారు తమ చేతులతో చేసిన వాటికి, తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు. కాబట్టి ప్రజలు అణచివేయబడతారు ప్రతి ఒక్కరు తగ్గించబడతారు వారిని క్షమించకండి. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి. మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు. సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి), ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి, పెద్ద పర్వతాలన్నిటికి, ఎత్తైన కొండలన్నిటికి ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు, ప్రతీ వాణిజ్య నౌకకు మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు. మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది మానవుల గర్వం తగ్గించబడుతుంది; ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు. విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు. ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు. యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి వారు కొండల గుహల్లో బండ బీటల్లో దాక్కుంటారు. తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని నరులను నమ్మడం మానండి. వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?
యెషయా 2:6-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ, పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు. వాళ్ళ దేశం వెండి బంగారాలతో నిండి ఉంది. వాళ్ళ సంపాదనకు మితి లేదు. వాళ్ళ దేశం గుర్రాలతో నిండి ఉంది. వాళ్ళ రథాలకు మితి లేదు. వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది. వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు. ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు. కాబట్టి వాళ్ళను అంగీకరించవద్దు. యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు. మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు. సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ, బాషాను సింధూర వృక్షాలన్నిటికీ, ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ, ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ, తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు. అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది. మనుషుల గర్వం తగ్గిపోతుంది. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి. యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు. ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు. ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు. యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ, ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో, కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు. తన ముక్కుపుటాల్లో జీవవాయువు ఉన్న మనిషి మీద నమ్మకం ఉంచడం మానుకో. అతని విలువ ఏ పాటిది?
యెషయా 2:6-22 పవిత్ర బైబిల్ (TERV)
మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండిపోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు. ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన ఆ విగ్రహాలను ప్రజలు పూజిస్తారు. ప్రజలు మరింతగా చెడిపోయారు. ప్రజలు మరీ హీనస్థితికి దిగజారి పోయారు. దేవా, నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ? వెళ్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి. గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు. యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు. గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు. గర్విష్ఠులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్లా, కొండల్లా ఉన్నారు. ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. ఆ గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు. ఆ సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు. విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది. మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.
యెషయా 2:6-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారువారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నదివారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ ములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నదివారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు దురు కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సింధూర వృక్షములకన్నిటికిని ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?