యెషయా 11:1-9
యెషయా 11:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.
యెషయా 11:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది. జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది. యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు. అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి. తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు. ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది. పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
యెషయా 11:1-9 పవిత్ర బైబిల్ (TERV)
యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు. ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి. ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది. అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
యెషయా 11:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది. యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు; కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు. నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది. తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు. ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది. పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది. నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.