యెషయా 11:1-16
యెషయా 11:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది. జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది. యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు. అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి. తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు. ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది. పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది. ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు. జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు. ఎఫ్రాయిముకున్న అసూయను నిలువరిస్తాడు. యూదా పట్ల విరోధంగా ఉన్న వాళ్ళు నిర్మూలమౌతారు. ఎఫ్రాయిము యూదాను బట్టి అసూయ పడడు. యూదా ఎఫ్రాయిమును బాధించడు వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు. యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.
యెషయా 11:1-16 పవిత్ర బైబిల్ (TERV)
యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు. ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి. ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది. అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు. ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది. ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరల తన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.) దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు. ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఎఫ్రాయిముకు కష్టం కలిగించదు. అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, క్రిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు. యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు. దేవుని శేషజనం అష్షూరును విడిచి వెళ్లటానికి వారికి దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు ఈజిప్టు నుండి బయటకు నడిపించినప్పటిలా ఉంటుంది.
యెషయా 11:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
యెషయా 11:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది. యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు; కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు. నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది. తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు. ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది. పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది. నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది. ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది. ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు. దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు. ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, యూదా శత్రువులు నశిస్తారు. ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు. వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు. యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు. ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.