హోషేయ 7:3-16
హోషేయ 7:3-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు. వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే. మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు. పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది. వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు. పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు. ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది. వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను. వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు. హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు. నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు. వారు తిరిగి వస్తారు గానీ, సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు.
హోషేయ 7:3-16 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి. రొట్టెలు చేసేవాడు రొట్టె చేసేందుకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు. మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు. ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకంతో మండుతాయి. వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది. వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.” “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది. పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు. కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి, కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు. కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజిప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు. సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి, ఆకాశపక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను. అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ఆ ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు. అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు. నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారి చేతులను బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు. దేవుళ్లు కానివారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.”
హోషేయ 7:3-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారుచేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మ్రింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను. అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ధములు చెప్పుదురు హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగునవారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
హోషేయ 7:3-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు. వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు. మన రాజు పండుగ దినాన, అధిపతులు ద్రాక్ష మద్యం మత్తులో ఉంటారు. అతడు అపహాసకులతో చేతులు కలుపుతాడు. వారి హృదయాలు పొయ్యివంటివి; కుట్రతో వారు అతన్ని సమీపిస్తారు. రాత్రంతా వారి కోపాగ్ని రగులుతూ ఉంటుంది; ఉదయాన అది మండే అగ్నిలా ప్రజ్వలిస్తుంది. వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు. “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది. విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు. ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు. “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది. వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను. వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు. వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, కాని తమ పడకల మీద విలపిస్తారు. ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు కాని వారు నా నుండి తొలగిపోయారు. నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు. వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.