హోషేయ 3:1-5
హోషేయ 3:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఎండు ద్రాక్షముద్దలను ఆశించి ఇతర దేవుళ్ళను పూజించినా నేను, యెహోవాను, వారిని ప్రేమించినట్టే తన భర్త ప్రేమను చూరగొనిన వ్యభిచారిణి దగ్గరికి పోయి ఆమెను ప్రేమించు.” కాబట్టి నేను పదిహేను తులాల వెండి, 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను. ఆమెతో ఇలా అన్నాను. “సుదీర్ఘకాలం నీవు నాతో ఉండిపో. వేశ్యగానైనా, ఏ మగవాడికి చెందిన దానిగానైనా ఉండవద్దు. నేను కూడా నీపట్ల అలానే ఉంటాను.” ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.
హోషేయ 3:1-5 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల చెప్పాడు. కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, లేక ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని, లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని, లేక, గృహ దేవతలు గాని ఉండవు. దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.
హోషేయ 3:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవావారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను పదునైదు తులముల వెండియు ఐదు తూములు యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని –చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందువారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
హోషేయ 3:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు. కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు, ఒక హోమెరు, ఒక లెతెకు యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను. అప్పుడు ఆమెతో, “నీవు నాతో చాలా కాలం జీవించాలి; నీవు వేశ్యగా ఉండకూడదు, వేరే ఏ పురుషునితో సన్నిహితంగా ఉండకూడదు, అలాగే నేను నీ పట్ల నమ్మకంగా ఉంటాను” అన్నాను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు. తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.