హోషేయ 2:14-23
హోషేయ 2:14-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.” ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు. “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. ఆ దినాన నేను జవాబిస్తాను.” ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి. భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి. నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లో రుహమా పై నేను జాలి పడతాను. నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.
హోషేయ 2:14-23 పవిత్ర బైబిల్ (TERV)
“కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు. “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “నేను ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి. ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది. అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి. భూమిమీద ఆమెను నేను నాటుతాను. లో-రూహామాకు నేను దయచూపిస్తాను. లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను. ‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”
హోషేయ 2:14-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును; అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలు అని నన్ను పిలువక–నా పురుషుడవు అనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు. –అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను. ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును; భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలుచేయు మనవి ఆలకించును. నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో–మీరే నా జనమని నేను చెప్పగా వారు–నీవే మా దేవుడవు అనియందురు; ఇదే యెహోవా వాక్కు.
హోషేయ 2:14-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను. అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది. యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు. నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు. ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు. నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను. నీవు యెహోవాను తెలుసుకునేలా, నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను. “ఆ రోజున నేను జవాబిస్తాను,” అని యెహోవా అంటున్నారు. “నేను ఆకాశాలకు జవాబిస్తాను, అవి భూమికి జవాబిస్తాయి; భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి. నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; ‘నా ప్రియురాలు కాదు,’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. ‘నా ప్రజలు కారు,’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”