హోషేయ 11:1-12
హోషేయ 11:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను. వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు. విగ్రహాలకు ధూపం వేశారు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే. వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే. నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు. మానవత్వపు బంధంతో వారిని నడిపించాను. స్నేహబంధాలతో తోడుకుపోయాను. వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను. వంగి వారికి అన్నం తినిపించాను. ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా? నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా? వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది. అది వారి పట్టణపు గడియలు విరగ్గొడుతుంది. వారిని నాశనం చేస్తుంది. నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుడినైన నాకు మొర పెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు. ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను? ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? నా మనస్సు మారింది. నా కనికరం రేగింది. నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను. నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను దేవుణ్ణి, మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి. నా ఉగ్రతతో బయలుదేరను. వారు యెహోవా వెంట నడుస్తారు. సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను. నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణకుతూ వస్తారు. వారు వణకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు. గువ్వల్లాగా అష్షూరు దేశంలోనుండి ఎగిరి వస్తారు. నేను వారిని వారి నివాసాల్లో కాపురముంచుతాను.” ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు. పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు.
హోషేయ 11:1-12 పవిత్ర బైబిల్ (TERV)
“ఇశ్రాయేలు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను. మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను. కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు. “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తుకొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు. తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం పెట్టాను. “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు. వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది. “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.” “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చుకుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను. నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశనుంచి వస్తారు. వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ వస్తారు. వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు. నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు. “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టుముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్-తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రులకు నమ్మకస్తుడుగా ఉన్నాడు.”
హోషేయ 11:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునితట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విస ర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది. నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు. వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
హోషేయ 11:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను. అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే, అంతగా వారు నా నుండి దూరమయ్యారు. వారు బయలుకు బలులు అర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు. ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, నడవడం నేర్పింది నేనే; అయితే వారిని స్వస్థపరచింది నేనని వారు గ్రహించలేదు. నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో, ప్రేమ బంధాలతో వారిని నడిపించాను. ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో, అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను, నేను క్రిందికి వంగి వారిని పోషించాను. “వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు. వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది; అది వారి అబద్ధ ప్రవక్తలను మ్రింగివేస్తుంది, వారి ఉపాయాలను తుదముట్టిస్తుంది. నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, నేను ఏ విధంగాను వారిని హెచ్చించను. “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది. నేను నా కోపాగ్నిని చూపించను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను, మనిషిని కాను, మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను. వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు. వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.