హెబ్రీయులకు 9:11-15
హెబ్రీయులకు 9:11-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
హెబ్రీయులకు 9:11-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్ళాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు. ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు. ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎద్దుల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది! ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.
హెబ్రీయులకు 9:11-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి! ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది.
హెబ్రీయులకు 9:11-15 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు. మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు. ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
హెబ్రీయులకు 9:11-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు. ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు. ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది! ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.