హెబ్రీయులకు 7:26-28
హెబ్రీయులకు 7:26-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతిదినం, మొదట తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకున్నప్పుడే వారందరి పాపాల కోసం ఒకేసారి అర్పించాడు. ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.
హెబ్రీయులకు 7:26-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు.
హెబ్రీయులకు 7:26-28 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
హెబ్రీయులకు 7:26-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.