హెబ్రీయులకు 4:12-16
హెబ్రీయులకు 4:12-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరుచేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది. సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్ళ ముందు ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది. కాబట్టి, పరలోకంలోకి ఎక్కివెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొందాం. అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కనుక మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు. కావున మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాం.
హెబ్రీయులకు 4:12-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది. ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.
హెబ్రీయులకు 4:12-16 పవిత్ర బైబిల్ (TERV)
దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది. పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
హెబ్రీయులకు 4:12-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
హెబ్రీయులకు 4:12-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది. సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్లెదుట ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది. కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము. అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కాబట్టి మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు. కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.