హెబ్రీయులకు 2:1-9
హెబ్రీయులకు 2:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కాబట్టి, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా, మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది. సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధ రకాల అద్భుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు. మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు. అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు? మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. సమస్తాన్ని వారి పాదాల క్రింద ఉంచారు,” సమస్తాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిదీ లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు. కాని, యేసు కొంతకాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల అందరి కోసం మరణాన్ని రుచిచూశారు కాబట్టి ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాము.
హెబ్రీయులకు 2:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు. మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు. దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు. అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు.
హెబ్రీయులకు 2:1-9 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము. దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. ఆ సందేశాన్ని అనుసరించనివానికి, దాన్ని విననివానికి తగిన శిక్ష లభించింది. మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులోవున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు. దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు. మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది: “మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు? మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు? నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు! మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి, అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.” దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
హెబ్రీయులకు 2:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితోకూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు –నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడ లేదుగాని దేవుని కృపవలన ఆయన ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము