హెబ్రీయులకు 12:18-29
హెబ్రీయులకు 12:18-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారుమబ్బు, తుఫాను; ఒక బూర శబ్దం లేక అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బతిమాలుకొన్నారు, ఎందుకంటే “ఒకవేళ ఒక జంతువైనా సరే ఆ పర్వతాన్ని తాకితే, అది రాళ్ళతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు. తాను చూసిన ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉండడంతో “నేను భయంతో వణుకుతున్నాను” అని మోషే చెప్పాడు. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు. పరలోకంలో పేర్లు వ్రాయబడిన ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు. మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం? ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు “నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు. “ఇంకొకసారి” అనేది కంపించబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి, అప్పుడు కంపించబడనివి నిలిచివుంటాయి. మనం కదల్చబడని రాజ్యాన్ని పొందుకొంటున్నాం గనుక, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం, ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”
హెబ్రీయులకు 12:18-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు. బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు. ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ. భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు. ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు. పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు. ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు. మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం? ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.” “మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది. కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం. ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.
హెబ్రీయులకు 12:18-29 పవిత్ర బైబిల్ (TERV)
తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి” అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను” అని అన్నాడు. కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు. జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను” అని వాగ్దానం చేసాడు. “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి. ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”
హెబ్రీయులకు 12:18-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే–నేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను. ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. మీకు బుద్ధిచెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా. అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు –నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశ మును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగాఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
హెబ్రీయులకు 12:18-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారు మబ్బు, తుఫాను; ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు, “ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు. ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు. పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు. మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం? ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు. “ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది. మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం, ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”