హెబ్రీయులకు 12:1-8
హెబ్రీయులకు 12:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి, మనకు ఆటంకం కలిగించే సమస్తాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాము. విశ్వాసానికి కర్తయైన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ, మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు. పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు. మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి, “నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు, ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు, ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.” మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు? అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు.
హెబ్రీయులకు 12:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు. మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు. కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.” ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
హెబ్రీయులకు 12:1-8 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు. మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు: “నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు! నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు! ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.” కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు.
హెబ్రీయులకు 12:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. మరియు –నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీక రించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.