హెబ్రీయులకు 11:3-6
హెబ్రీయులకు 11:3-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కనుక కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాం. విశ్వాసము ద్వారానే హేబెలు కయీను కంటె ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితం నుండి మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు గనుక, అతడు కనబడలేదు” అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కొరకు ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.
హెబ్రీయులకు 11:3-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం. విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
హెబ్రీయులకు 11:3-6 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట. హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు. హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
హెబ్రీయులకు 11:3-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లుకొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
హెబ్రీయులకు 11:3-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కాబట్టి కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాము. విశ్వాసం ద్వారానే హేబెలు కయీను కంటే ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితంలో మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.” అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.