హెబ్రీయులకు 10:22-25
హెబ్రీయులకు 10:22-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకొందాం. ప్రేమ మరియు మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం, కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సాహించుకుందాం.
హెబ్రీయులకు 10:22-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం. అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
హెబ్రీయులకు 10:22-25 పవిత్ర బైబిల్ (TERV)
తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం. ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.
హెబ్రీయులకు 10:22-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
హెబ్రీయులకు 10:22-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము. ప్రేమ మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం, కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము.