ఆదికాండము 9:1-29

ఆదికాండము 9:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి–మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో –ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు–నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు –నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను. ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని– కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు– షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

షేర్ చేయి
Read ఆదికాండము 9

ఆదికాండము 9:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి. ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు. మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు. దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, “వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను, మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు. దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు. ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు. దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు. ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది. నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు. ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక. దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు. ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 9

ఆదికాండము 9:1-29 పవిత్ర బైబిల్ (TERV)

నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. భూమిమీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.” “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. అదంతా నీదే. అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను. “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు. కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి. “నోవహూ! నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక!” తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.” తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.” కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు. నోవహుతో కూడ అతని కుమారులు ఓడలోనుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి). ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారులనుండి వచ్చినవాళ్లే. నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని త్రాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు. కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు. ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసినదాన్ని అతడు తెలుసుకొన్నాడు. కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!” నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక. యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు నివసించును గాక! కనాను వారికి బానిస అవును గాక!” జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతడు మరణించాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 9

ఆదికాండము 9:1-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి. భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి. జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను. “అయితే మాంసంలో ప్రాణాధారమైన రక్తం ఉంటే మీరు తినకూడదు. ఎవరైనా ఇంకొకరి ప్రాణం తీస్తే నేను వారి రక్తం గురించి లెక్క అడుగుతాను. అడవి జంతువు ఒక మనుష్యుని చంపితే, అది చంపబడాలి. ఎవరైనా తోటి మనుష్యుల ప్రాణం తీస్తే దాని గురించి నేను లెక్క అడుగుతాను. “ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు. మీరైతే, ఫలించి, అభివృద్ధిచెంది; భూమిపై విస్తరించండి” అని చెప్పారు. దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: “నేను మీతో మీ రాబోయే తరం వారితో నా నిబంధన స్థిరపరస్తున్నాను, మీతో పాటు ఉన్న ప్రతి జీవితో అనగా పక్షులతో, పశువులతో, సమస్త అడవి జంతువులతో, ఓడలో నుండి మీతో పాటు బయటకు వచ్చిన జీవులన్నిటితో, భూమిపై ఉన్న ప్రతి జీవితోను నా నిబంధన స్థిరపరస్తున్నాను. నేను నీతో చేసిన నిబంధనను ధృవీకరిస్తున్నాను: ఇక ఎన్నడు వరద నీటితో సమస్త ప్రాణులు నాశనం కావు; భూమిని నాశనం చేసే జలప్రళయం ఇక ఎన్నడు రాదు.” దేవుడు ఇలా అన్నారు, “నాకును మీకును, మీతో ఉన్న ప్రతి ప్రాణికిని మధ్య తరాలన్నిటి కోసం నేను చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే: నేను మేఘాలలో నా ధనుస్సును పెట్టాను, అది నాకూ భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది. నేను భూమిపై మేఘాలను తీసుకువచ్చినప్పుడు ఈ ధనుస్సు మేఘాలలో కనిపిస్తుంది, అప్పుడు నేను నాకును మీకును, ప్రతి రకమైన ప్రాణులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక ఎన్నడు కూడా సమస్త జీవులన్నిటిని నాశనం చేయడానికి నీరు వరదలా మారదు. మేఘాలలో ధనస్సు కనిపించినప్పుడు, నేను దానిని చూసి దేవునికి, భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు మధ్య నేను చేసిన నిత్యనిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను.” ఇంకా దేవుడు నోవహుతో, “ఇది నాకూ భూమిపై ఉన్న సమస్త జీవులకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు” అని చెప్పారు. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.) ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు. వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు. అతడు కొంత మద్యం త్రాగి మత్తులో తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. కనాను తండ్రియైన హాము తన తండ్రి దిగంబరిగా ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు చెప్పాడు. అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు. నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని, ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి. దేవుడు యాపెతు సరిహద్దును విస్తరింపజేయాలి; యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, కనాను యాపెతుకు దాసుడవాలి” అని అన్నాడు. జలప్రళయం తర్వాత నోవహు ఇంకా 350 సంవత్సరాలు జీవించాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 9