ఆదికాండము 8:1-16
ఆదికాండము 8:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకా శమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను. అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైనతరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను. నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటిమీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు–నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
ఆదికాండము 8:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి. అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది. అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి. ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది. పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి. నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది. నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు. భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు. సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు. అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు. ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది. రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది. అప్పుడు దేవుడు నోవహుతో, “నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.
ఆదికాండము 8:1-16 పవిత్ర బైబిల్ (TERV)
అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి. ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది. నేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. ఇది ఏడవ నెల పదిహేడవ రోజు. నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి. నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు. ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది. ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలనుకొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలనుకొన్నాడు. నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు. ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు. ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఒలీవ ఆకు ఆ పావురం నోటిలో ఉంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్లుగా నోవహుకు అది ఒక గుర్తు. ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు. ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్లుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు. రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు: “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి.
ఆదికాండము 8:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే దేవుడు నోవహును, అతనితో ఓడలో ఉన్న సమస్త అడవి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకుని, భూమి మీదికి గాలిని పంపినప్పుడు నీరు వెనుకకు తగ్గింది. అగాధజలాల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి, ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఆగిపోయింది. భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి, ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది. పదవనెల వరకు నీరు తగ్గుతూ ఉంది, పదవనెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి. నలభైౖ రోజుల తర్వాత నోవహు తాను తయారుచేసిన ఓడ కిటికీ తెరిచి, ఒక కాకిని బయటకు పంపాడు, అది భూమిపై నీళ్లు ఆరిపోయే వరకు ఇటు అటు ఎగురుతూ ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో చూడటానికి నోవహు ఒక పావురాన్ని బయటకు పంపాడు. అయితే భూమి మీద అంతటా నీరు ఉన్నందుకు ఆ పావురానికి వాలడానికి చోటు దొరకలేదు; కాబట్టి అది ఓడలో ఉన్న నోవహు దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చేయి చాపి, పావురాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు. సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు. మరో ఏడు రోజులు ఆగి, ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు, అయితే ఈసారి అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది. రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు దేవుడు నోవహుతో, “నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి.