ఆదికాండము 49:1-27

ఆదికాండము 49:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను. యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి. పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు. షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు. వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు? షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి. ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి. జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది. ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద. అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు. దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను. దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు. యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి. నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”

షేర్ చేయి
Read ఆదికాండము 49

ఆదికాండము 49:1-27 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబుతాను. “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి. “రూబేనూ, నీవు నా మొట్టమొదటి కుమారుడవు, నా బలం నీవు. పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే. నా కుమారులందరిలోను గౌరవించదగినవాడివి, మహా బలశాలివి నీవు. కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు, కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన నా కుమారుడవు కావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు. నీ తండ్రి భార్యలలో ఒకదానితో నీవు శయనించావు నీవు నా పడకకు అవమానం తెచ్చావు, ఆ పడకపై నీవు శయనించావు. “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి. రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను, వారు వారి పగవారిని కోపంతో చంపారు. వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేశారు. వారి కోపం శాపం, అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు. యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు. ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు. “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు. యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు. యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడువదు. అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు. అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు. ద్రాక్షారసం త్రాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి. పాలు త్రాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి. “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు. అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది. అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది. “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు. భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు. అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్లు చూసుకొంటాడు తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్లు అతడు చూసుకొంటాడు. తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు. బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు. “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక. త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక. ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది. ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు. “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను. “దొంగల గుంపు గాదు మీద పడ్తారు. కానీ గాదు వారిని తరిమివేస్తాడు.” “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.” “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి. అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.” “యోసేపు చాలా విజయశాలి. నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా, కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు. చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు. బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు. అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను అతడు పోరాటం గెల్చాడు. తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి గొర్రెల కాపరినుండి, ఇశ్రాయేలు బండనుండి నీకు సహాయకుడైన నీ తండ్రి దేవునినుండి అతడు పొందుతాడు. “సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! పైన ఆకాశంనుండి ఆశీర్వాదములను, అగాధ స్థలములనుండి ఆశీర్వాదములను ఆయన నీకు అనుగ్రహించునుగాక. స్తనముల దీవెనలు, గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చునుగాక. నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను. నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టారు. అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.” “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు. ఉదయాన అతడు చంపుకొని తింటాడు. మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”

షేర్ చేయి
Read ఆదికాండము 49

ఆదికాండము 49:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. –మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనూ, నీవు నా పెద్దకుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను. షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పెట్టినదానితిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును. ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్త బలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయముచేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.

షేర్ చేయి
Read ఆదికాండము 49

ఆదికాండము 49:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను. “యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి. “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు. “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు. వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. “యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు; నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది; నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు యూదా, నీవు ఒక కొదమసింహం; నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు? రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి. అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను, మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు; అతడు ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు. అతని కళ్లు ద్రాక్షరసం కంటే ఎర్రగా, అతని పళ్లు పాలకంటే తెల్లగా ఉంటాయి. “జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు ఓడలకు రేవు అవుతాడు; అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది. “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు. అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో, అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు, అతడు భుజం వంచి శ్రమించి, వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు. “దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంలా తన ప్రజలకు న్యాయం చేస్తాడు. దాను దారిన ఉండే పాములా, మార్గంలో ఉండే విషసర్పంలా, గుర్రాల మడిమెలు కాటు వేస్తాడు. అప్పుడు స్వారీ చేస్తున్నవాడు వెనుకకు పడతాడు. “యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను. “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు. “ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు. “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు. “యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి. అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు. కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి, నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి. నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి. “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”

షేర్ చేయి
Read ఆదికాండము 49