ఆదికాండము 48:1-22
ఆదికాండము 48:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు. “నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు. యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి, ‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు. “కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు. వారి తర్వాత నీకు పిల్లలు పుడితే వారు నీ సంతానమవుతారు; వారు వారసత్వంగా పొందిన భూభాగంలో వారు తమ సోదరుల పేర్లతో లెక్కించబడతారు. నేను పద్దన నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.” ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు. “వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు. ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నందుకు దృష్టి మందగించింది కాబట్టి అతడు చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు తన కుమారులను అతనికి సమీపంగా తెచ్చాడు, తన తండ్రి వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు. అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు. యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు. అయితే ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా త్రిప్పి చిన్నవాడైన ఎఫ్రాయిం తలపై తన కుడిచేతిని మొదటి కుమారుడైన మనష్షే తలపై తన ఎడమ చేతిని పెట్టాడు. అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు, నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత ఈ బాలురను దీవించును గాక. వారు నా నామాన నా పితరులైన అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక, భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.” తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు. యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు. కాని అతని తండ్రి ఒప్పుకోకుండా, “నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు, అతడు కూడా జనాల సమూహమై గొప్పవాడవుతాడు. అయినా, అతని తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు, అతని వారసులు జనాల సమూహం అవుతారు” అని చెప్పాడు. అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు: ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ” కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు. నీ సోదరులకంటే ఎక్కువగా ఒక కొండ ప్రాంతం, నా ఖడ్గం, నా విల్లుతో అమోరీయుల దగ్గర నుండి తీసుకున్న కొండ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను” అని చెప్పాడు.
ఆదికాండము 48:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. “ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు” అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు. అతడు యోసేపుతో “కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ‘ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అన్నాడు. నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే. వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి. పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు. ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు. యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు. ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపుతో “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని, వారిద్దరిని అతని సమీపంగా తీసుకు వచ్చాడు. ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు. ఇశ్రాయేలు యోసేపును దీవించి “నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు, సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి, “నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు” అని చెప్పాడు. అతని తండ్రి ఒప్పుకోక “నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు” అన్నాడు. ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. “ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, ‘ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక’ అని మీ పేరెత్తి దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. ఇశ్రాయేలు “ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. నేను నీ సోదరులకంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దాన్ని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను” అని యోసేపుతో చెప్పాడు.
ఆదికాండము 48:1-22 పవిత్ర బైబిల్ (TERV)
కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు. అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’ ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారు కూడ నాకు అంతే. కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి కూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే, వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు. పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.” అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు. యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు. “నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో. అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు. ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు). కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు: “నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు. ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి. వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.” తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు. యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు. అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.” అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు. “ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు నీ నామాన్ని ఉపయోగిస్తారు. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.” ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు. అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”
ఆదికాండము 48:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ సంగతులైన తరువాత–ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను. యోసేపును చూచి–కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి –ఇదిగో నీకు సంతానాభి వృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను పిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలైయుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా యోసేపు–వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్ర హించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు–నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతనిదగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దుపెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసే పుతో–నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతితట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతితట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి–నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందువారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండి యెత్తి –నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక–అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగునుగాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి–ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిం చెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు–ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీపితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును. నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.