ఆదికాండము 45:8-15
ఆదికాండము 45:8-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు. ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి! మీరు, మీ పిల్లలు, మీ మనవళ్లు, మీ మందలు, మీ పశువులు, మీతో ఉన్న సమస్తం గోషేను ప్రాంతంలో నాకు సమీపంగా ఉండవచ్చు. ఇంకా రాబోయే అయిదు సంవత్సరాలు కరువు ఉంటుంది అయితే అక్కడ మిమ్మల్ని నేను పోషిస్తాను. లేకపోతే మీకు మీ ఇంటివారికి పేదరికం ఏర్పడుతుంది.’ “మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు. ఈజిప్టులో నాకు ఇవ్వబడిన ఘనత గురించి, మీరు చూసిన ప్రతి దాని గురించి నా తండ్రికి చెప్పండి. నా తండ్రిని ఇక్కడకు త్వరగా తీసుకురండి” అని చెప్పాడు. తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు. తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
ఆదికాండము 45:8-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు. నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి. ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి. ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి. ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు. తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు. అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
ఆదికాండము 45:8-15 పవిత్ర బైబిల్ (TERV)
నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.” “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’” యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపును అని చూడగలుగుతున్నారు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.” అన్నాడు అతడు. అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు. తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
ఆదికాండము 45:8-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో–నీ కుమారుడైన యోసేపు– దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియ చేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీదపడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.