ఆదికాండము 45:4-7
ఆదికాండము 45:4-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు. మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
ఆదికాండము 45:4-7 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.
ఆదికాండము 45:4-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట యోసేపు–నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి నప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు–ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
ఆదికాండము 45:4-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని! ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు. ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు. అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.